ప్రభాత భానుడి అరుణోదయం.
నవ జీవన వేదానికి ప్రభోదయం,
కోయిల కుహు కుహు లు ,
పక్షుల కిలకిలలు,
హిమ బిందువుల తళ తళలు ,
నయనాలంకృత దృశ్య పధ కేళికి
ప్రకృతి
పురి విప్పిన మయూరమై నర్తించగా ,
సుస్వర గీతికలై ,
నీలాల గగనాల ఆ మేఘమాల ,
కురిపించిన చిరు జల్లులు
హరివిల్లై గగనాన ,
ఇల చేరుతూ
ఘల్లు ఘల్లు మని
పుడమిని తాకగ ,
విస్ఫులించిన పుడమి పరాగ పరిమళాలు
మైమరపించగా ,
చిటపట చినుకు ల తొలకరి లో ,
చిరు చిరు చిగురులు చిగురించగా ,
చిరు చిరు నగవుల సొగసులతో ,
అరకొర విరిసిన నవ్వులతో ,
విరబూసిన కుసుమాలు
సుమధుర సుగంధ
పరిమళాలు వెదజల్లగ
చల్లగా వీచే పవనాల మృదు మధుర స్పర్స ,
సుస్వర గీతికలై
వీనుల తాకగా,
ఉప్పొంగిన తరంగమై
ఎగసిన మనసే
జన పదాలు ఆల పించగా
కరాలు కలిపి ,
హలాలు పట్టి
పొలాలు దున్ని ,
చిందిస్తూ స్వేదం ,
చేస్తున్న సేద్యం ,
మన దేశపు సౌభాగ్యం,
పవనాల జోరుకు తల లూపుతూ
పచ్చని పసిడి కంకు
పైరుల మిలమిలలు ,
ఈదురు గాలుల మురళి రవాలు,
మైమరపిస్తుంటే ,
మలి సంధ్య వేళ
గోవుల ' పధ ' ధూళి
నింగి కెగసిన తరుణం లో ,
గగనపు వీధులన్నీ
సింధూరము దిద్దు కుంటున్న వేళ
సిగ్గుతో ఎరుపెక్కిన ,
నిచ్చెలి చెక్కిలి లా,
అరుణ వర్ణము
దాల్చిన దిఙ్మండలము,
చక్కని ' రిక్క ' ల మల్లెలు
సిగలో ధరించి న
గగనము
కాటుక నింపిన భరిణై,
నల్లని కురులు విరబోసినట్లు ,
చీకట్లు పరుచుకుంటున్న వేళ
వెన్నెల వెండి వెలుగులు
పరుచుకుంటున్న వేళ,
మిలమిల మెరుపుల ,
చిలిబిలి తళుకుల ,
చిరు చిరు నగవుల కెరటాలతో ,
వయ్యారి గోదారి ,
ఆ కిన్నెరసాని
సొగసుల హోయలు,
కనువిందు చేస్తుంటే యేమని వర్ణించాలి
ప్రకృతి రమణీయం.
-----కృష్ణ
