Saturday, October 31, 2015

మహా కవి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

నంది వర్ధనాల  పట్టు కొమ్మ  మన  మహా కవి శ్రీ  సిరివెన్నెల  సీతారామ శాస్త్రి గారు. సినీ నేపధ్యగీతాలలో  తనదంటూ ప్రత్యేక శైలిని , స్థాయిని ఏర్పరుచుకుని  తెలుగు వారు గర్వించదగ్గ ప్రపంచ స్థాయి మహా  కవిగా  సుస్థిర  స్థాన్నాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ మహానుభావుడి గురించి కొన్నివిషయాలు ప్రస్తుతించడము  అదృష్టము గా భావిస్తూ ....

                        విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం
                       ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం
                           కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
                           ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
                           సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది 
                                         నే పాడిన జీవన గీతం ఈ గీతం
                                        విరించినై విరచించితిని ఈ కవనం
                                          విపంచినై వినిపించితిని ఈ గీతం .....

బ్రహ్మ యొక్క ఆలోచనలలో  యెప్పుడో పుట్టిన సృష్టి కి మూలవేదం "ఓం ",  అంటూ ఓంకారం  చుట్టి ,
నా ఉచ్వాసము  కవిత్యము , నా నిశ్వాసము పాట గా  సినీ గేయ రచయిత గా , సాహితీ చరిత్రలో తనదంటూ  ఓ బంగారు పేజి ని సృష్టించుకున్న, శ్రీ  సిరివెన్నెల  సీతారామశాస్త్రి గారికి                   పాదాభి వందనాలు చేస్తూ  .....   శుభోదయం  , 
                                            కళాభ్యుదయ  వాది కి అరుణోదయం,
                                           ప్రభవించిన  చాతుర్యానికి  ప్రభోదయం ,
                                           కలం పట్టి , పదాలు దున్ని, మీరు చేస్తున్న పదకవితా సేద్యము,
                                           కలలు కదిపి, కలం కదిపి , గీతాల నిండా  పదాలు నింపి ,
                                          సుస్వర , సుశబ్ద పదాల మాల నూర్చి , 
                                          మీరు చేస్తున్న  సాహితీ సాగర మధనం ,
                                         మధురామృత కావ్య  జననం  ....
ఆది భిక్షువు వాడినేది కోరేది 
బూడిదిచ్చేవాడినేది అడిగేది 
ఏది కోరేది వాడినేది అడిగేది 
ఏది కోరేది వాడినేది అడిగేది   
                             అంటూనే తొలి  "నంది " ని తెచ్చి  ఇంట్లో పెట్టేసుకున్నారు. 

మూడు వేలకు పైగా పాటలు , పది  నంది అవార్డు లు,  మూడు  ఫిలిం ఫేర్  అవార్డు లు .
అత్యంత  అద్భుతము గా రాయడమే కాకుండా , అత్యధిక  పారితోషిక  గౌరవాన్ని 
దక్కించుకున్న ఘనత కూడా శాస్త్రి గారిదే. గర్వించ దగ్గ  రచయితలలో  " శ్రీ వేటూరి "  గారు  , "శ్రీ ఆత్రేయ " గారి తో సమానము గా రాయగల సామర్థ్యము గలవారని  అభివర్ణిస్తూ  ఉంటారు. 
వర్ధమాన  రచయితలు  చంద్రబోస్  , అనంత శ్రీరాం  ,రామజోగయ్య శాస్త్రి గార్లు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి  గారిని  గురువుగా భావించి గౌరవించుకుంటూ ఉంటారు. 

తెలుగు సాహిత్య రంగము లో సిరివెన్నెల గారు చేస్తున్న కృషి ఎనలేనిది. ఆయన  రచనలలో ఎక్కడా   ద్వందార్ధాలు కనపడవు. అశ్లీలత ఆమడదూరం లో ఉంటుంది. తెలుగు భాష ఔన్నత్యాన్ని, విలువలను, మన సంస్క్రుతి సాంప్రదాయాలను, స్థాయిని, ప్రతిబింబింప చేసేవిగా ఉంటాయి.  

ప్రముఖ  దర్శకులు శ్రీ  త్రివిక్రమ్  శ్రీనివాస్ గారి మాటల్లో  :

"శాస్త్రి గారు  పాట  రాస్తే  నిఘంటువు  దగ్గరకు  పరిగెత్తాలి"  అంటారు        

ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన 
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా ....

ఆ పాట విన్నంతనే "తెలుగు dictionary" ఒకటుంటుంది   అని  దాని  పేరు  "శబ్ద రత్నాకరము " అని తెలుసుకున్నాను అంటారు. ఒక పాటను అర్థము అయ్యేలా మాత్రమె  కాదు అర్థము చేసుకోవాలి అనే కోరికను పుట్టించేదిగా కూడా   రాయచ్చు అని, తెలుగు పాట  స్థాయిని పెంచిన వ్యక్తి  శ్రీ సీతారామ శాస్త్రి గారు అని  కొనియాడతారు.

రాత్రిళ్ళు  టేబుల్ మిద ఆయన  ఖర్చు చేసిన క్షణాలు,  ఆయన ఖర్చు చేసిన జీవితం, 
ప్రపంచం అంతా పడుకున్న తరువాత ఆయన నిద్రలేస్తాడు , అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.
ఆయన పదాలు అనే కిరణాలు  తీసుకుని అక్షారాలు అనే తూటాలతో ప్రపంచం మీదకు వేటకు
బయలు దేరుతాడు. రండి, నాకు సమాధానం చెప్పండి, మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకు   సంధిస్తాడు. మన  ఇంట్లోకి  వస్తాడు,  మన  ప్రక్కనే  నిలుచుంటాడు,  ఎప్పుడు  ఒప్పుకోవద్దు "ఓటమి"  ని అంటాడు. వచన  కవిత్వానికి  నోబుల్  స్థాయిలో  రాయగల  సామర్థ్యం  ఉన్న  కవి అంటారు శ్రీ  త్రివిక్రమ్  శ్రీనివాస్.
వాడుక  భాషలో  ,  ఆధునిక  పాశ్చాత్య   పోకడలతో  ప్రస్తుత పరిస్థితులలో గీతాలకు  వ్యాపార పరము గా ప్రాధాన్యము ఉన్నా, తెలుగు భాష గొప్పదనము  తెలుగు వారి , సంస్క్రుతి  సాంప్రదాయాలు  , సాహిత్య విలువలు కాపాడు కుంటూ వస్తున్న మార్గ దర్శకులు శ్రీ సీతారామ శాస్త్రి గారు.అంతే కాదు అవసరము అనుకుంటే  ఆ పాట ను రాసే అవకాశాన్ని వదులుకుంటాను కానీ ,అలంటి పాటలు రాయను  అని చెప్పేస్తారు. అంతటిసామర్థ్యము ఉన్న  రచయిత.

ఆయన పాటలలో పద  సామర్థ్యము  మాత్రమే కాదు , పలు  సామాజిక  అంశాలను కూడా, సున్నితముగా సృసిస్తూ ఉంటారు. ఒక్కో సారి కవితా వెశము లో 

 " నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
 అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
 మారదు లోకం మారదు కాలం
 దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
 మారదు లోకం మారదు కాలం "

"అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా  "

...అంటూ నిష్కర్ష గా విరుచుకు పడతారు . ఆయన రాసే ప్రతి పాట మార్గ దర్శకమె  ,
ప్రతి మాట అముల్య మైనదే .

రుద్రవీణ అనే చిత్రము లో  ఆయన రాసిన ఒకపాట  గురించి  విష్లెసిస్తూ, అడవి గాచిన వెన్నెల అనే పదాన్ని చాలాసార్లు వింటాము గాని వెన్నెలవృధా కావడము ఏమిటి, నాకు నచ్చ  లేదు, అందుకే   
"తరలి రాదా తనే వసంతము  తన దరికి రాని  వనాలకోసము " అంటూ 
"వెన్నెల దీపముకొందరిదా , అడవికి సైతము వెలుగు కదా" అంటూ   న్యాయము  చేసాను అంటారు.  
అంతే కాకుండా ఈ చిత్రము సామాజిక ఇతివృత్తము తో కూడినది .హీరో తండ్రి సంగీత 
విద్వాంసుడు ,ఆయన పాటలు హరిజనులు కోసము పాడడము ఇష్టము ఉండదు. కానీ ఆయన కుమారుడికి ఇది ఇష్టము ఉండదు. అందరు సమానమే, మీ సంగీతము పండితులకు, పామరులకు కూడా ఒకే   విధమైన  ఆనందాన్ని  ఇస్తుంది  అని  వాదిస్తూ  ఉంటాడు. ఆ భావాన్ని అంతర్లీనంగా వచ్చే విధము గా  "వెన్నెల దీపం  కొందరిదా, అడవికి  సైతము వెలుగుకద", రాసారు. విశిష్టమైన  illustrated  రచనా శైలి లో  అందే వేసిన చేయి  మన  సీతారామ శాస్త్రి గారిది. 


నంది అవార్డుల వివరాలు  :
1986      సిరివెన్నెల       " విధాత తలపుల "
1987      శృతిలయలు     " తెలవారదేమో స్వామి "
1988     స్వర్ణ కమలం    " అందేలా రవమిది "
1993      గాయం             "సురాజ్యమనలేని "
1994       శుభలగ్నం       " చిలకా ఆ తోడులేక " 
1996       శ్రీకారం            " మనసు కాస్త "
1997       సింధూరం         " అర్థ శతాబ్దపు  "
1999       ప్రేమకథ.          " దేముడు కరుణించాడని  " 
2005        చక్రం.             " జగమంత కుటుంబం నాదీ "
2008        గమ్యం.           "ఎంత వరకో"

--------కృష్ణ 

Wednesday, October 28, 2015

అమ్మ

అమ్మ 

ఈ  రెండక్షరాల  పదం  గురించి  పేజీలు పేజీలు రాసినా సరిపోదేమో . ఎంతో  మంది  కవులు చాలా  అందంగా వర్ణించారు . కానీ  నాకు  గుర్తున్నంతవరకు, నేను  మా  అమ్మని చాలానే అనేదాన్ని. ఆవిడ  అంటే ఎప్పుడూ  తక్కువ అభిప్రాయమే. నాకు  బాగా  గుర్తున్న, నేను  అన్న మాటలు
"అమ్మ  అన్నిటికి  ఒద్దు  అంటుంది "
"ఎప్పుడు  ఇలా  చేయి  అలా  చేయి  అని  క్లాసు పీకుతుంది"
"అమ్మకి  ఏమి  తెలీదు"
"అమ్మ  అర్థం  చేసుకోదు"

అలా  ఉన్న  నేను, కాలేజీకి  వచ్చాక  అంత  పెద్ద  విలన్ అనుకున్న  మా  అమ్మే నాకు  మంచి స్నేహితురాలని  అర్థం చేసుకున్నాను. ప్రతి  విషయం  అమ్మ  తో  చెప్పేదాన్ని. నేను ఏమి మాట్లాడక  పోయినా,  నా  మనసులో  ఉన్నది కనిపెట్టేసేది. బాధని  సంతోషాలని, అన్నీ  కూడా మొదట  తనతోనే పంచుకునేదన్న్ని.  ఆవిడ  నాకు  ఎదురుగా  ఉండటం  ఒక కారణం అయితే, ఎప్పుడు  అవసరమైనా, అది  అర్థరాత్రి అయినా  లేక  ముఖ్యమైన  పనిలో  ఉన్నా కూడా, నేను  తనతో మాట్లడచన్న నమక్కం  ఇంకొక  కారణం.
ఆవిడ  నాకు  దూరం  అయ్యి  ఇంచుమించుగా  ఎనిమిదేళ్ళు అవ్తోంది. అమ్మ  ఎంత అవసరమో,  దూరం  అయితే  ఆ  బాధ ఎంత  కష్టంగా  ఉంటుందో  నాకైనా  ఎక్కువ  ఎవరూ చెప్పలేరేమో  అనిపిస్తోంది. చిన్నపుడే  అమ్మ  దూరం  అయితే, మనకి  తెలియని  వయసు కదా అనుకోవచ్చు. అలా అని వాళ్ళకి బాధ ఉండదని కాదు. కానీ, అమ్మ  తీయదనం  రుచి తెలిసాక దూరం  అయితే  ఆ  బాధ  చెప్పుకోలేనిది, తీర్చలేనిది. కూతురికి పెళ్లి  చేసాక  అమ్మ బాధ్యత తీరిపోతుంది  అనుకుంటారు అందరు. కాని  ఒక  మాట  అడుగుతాను, మీలో  ఎంత మంది, పెళ్లి అయ్యాక,
"అమ్మా , మా  అయన  ఇలా  చేసారు. నాకు  ఏమనాలో తెలియలేదు. నువ్వైనా  చెప్పు  నేనేం చేయను"
"అమ్మా, మా ఆవిడకి నువ్వు చేసినట్లు వంట నేర్పించు"
"అమ్మా, మా  పిల్లలకి  దగ్గ్గుగా  ఉంది, ఇంటి  వైద్యం  ఏం చేయచ్చో  చెప్పు"
"అసలు  ఏమి  లేదు, విసుగ్గా  ఉంది. అందుకే  నీకు  చేశాను"
అని  యెంత   మంది  ఫోన్లు  చేస్తారు. నాకు  తెలిసి  నూటిలో తొంభైతొమ్మిది  మంది  ఇలా అడుగుతూనే  ఉంటారు. ప్రతి అడుగులో  అమ్మ  కావాలి. అమ్మ  అవసరం  ఉంది. చివరిగా అనట్లు, ఆఖరికి, పిల్లలు  మనని విసిగించినా  లేక  భర్త  తో చిరాకు  వచ్చినా(భార్య మీద చిరాకు వస్తే భర్త అమ్మ దగ్గరకి వెళ్ళడు, భార్య మీద అరిచేసి శాంత పడిపోతాడు) అమ్మ  మీదే చూపిస్తాము. ఎందుకంటే  ఆవిడ  మన  బాధని  కోపం తెచ్చుకోకుండా   అర్థం  చేసుకోవటానికి ప్రయత్నిస్తుందని  ధైర్యం.

మరి  మనసులో  ఇంత  ప్రేమ  ఉంటుంది  కదా, మనలో యెంత  మంది  ఏడాదికి ఒకసారయినా, మన  మనసులో  వాళ్ళ మీద  ఉన్న  ప్రేమని  చెప్తాము?
"చెప్పాలేంటి" అని  అంటారేమో. "ఏం, మన  పిల్లలు  మనతో ప్రేమగా  ఉంటె  పొంగిపోమా, మరి  మనం  ఎందుకు  అలా చెప్పలేము, పెద్దవాళ్ళం  అయిపోయామా? విస్సుకోవటానికి అమ్మ కావాలి  కానీ, నువ్వంటే  నాకు  ఇంత  ఇష్టం  అని చెప్పటానికి  మాత్రం  మాటలు  అవసరం లేదా?"
నేను  చాలా  మంది  దగ్గర  విన్నాను, వెస్ట్రన్  కల్చర్, "మదర్స్ డే " ట  అమ్మ  దినం ఏంటో అని. అది  మనం తీసుకునే  అర్థంలో  ఉంటుంది. వాళ్ళు  ఏడాది లో  ఒక్కసారి అయినా  అమ్మ కి  కృతజ్ఞతలు  చెప్పుకుంటారు  కానీ  మనం చెప్పము. ఏడాది  మొత్తం  మనం  చిరాకు పడతాము, విసుక్కుంటాము, మన  పనులు  చేయించుకుంటాము, సలహాలు  అడుగుతాము ఇంకా  ఎన్నో  చేయించుకుంటాము కానీ  మనకి  "థాంక్స్  అమ్మా, నువ్వు  చేసే  వాటి  ముందర ఇది చిన్న  మాటే " అని  చెప్పటానికి  అహం  అడ్డొస్తుంది . అలా అని  వాళ్ళు  చేసేదాన్ని ఒప్పుకోము, ఎందుకంటే  అది వెస్ట్రన్ కాబట్టి. మంచి  ఎక్కడ  ఉన్నా నేర్చుకోవాలి  అనప్పుడు ఉన్నవాటిలో  మంచిని  తీసుకోవటం  మానేసి, చెడుని ఎందుకు వెతుకుతారు.
నేను  మా  అమ్మకి   వాలెంటైన్స్  డే,  మదర్స్  డే, ఫ్రెండ్షిప్  డేకి ప్రతి  సారి  విష్  చేసేదాన్ని. అమ్మ  ఏ  కదా  మనలని మొదట ప్రేమించినది, అమ్మే మన మొదటి స్నేహితురాలు అమ్మే కదా అన్నీ.

---Achanta Nagabhargavi

Sunday, October 25, 2015

ఎన్ని"కల"లో

 ఎన్ని "  కల  " లో

భిన్న  స్వరాల  యుగళ  గీతం 
 ఎన్నికల శంఖారావం
అధికారం  లో కొందరు  , 
అధికారం కోసం  కొందరు
విప్లవం  (మార్పు ) కోసం  కొందరు,
పూరిస్తున్న  శంఖారావం.  
ఆరొపణాస్త్రాలతో  ,
వ్యంగ్య  బాణాలతో 
విమర్శనాస్త్రాలతో  సంసిధం
ఎన్నికల  రణరంగం 
ఎన్నికలలో  .......... ఎన్ని  కలలో
ఆశయాలతో  , 
ఆశలతో కురుపిస్తున్న  
వాగ్దానాస్త్రాలు  ,
మనీ  మురిపించినా , 
మత్తు  మైమరపించినా  ,
నిజం  మరచి 
నిన్ను మరచి  
తాత్కాలిక  సౌఖ్యం కోసం , 
ఓటు  అమ్ముకుంటే
చిరిగిన చొక్కా  , పగిలిన  అద్దం 
నోటుకు ఓటు అమ్ముకున్న ప్రతిసారి  
నీకు  దక్కేసౌఖ్యం ...........

--కృష్ణ 

Tuesday, October 13, 2015

శుభోదయం

కళాభ్యుదయ  వాదులకు  అరుణోదయం
ప్రభవించిన  చాతుర్యానికి  ప్రభోదయమ్ ,
కలాలు పట్టి,
పదాలు దున్ని ,
చేస్తున్న పదకవితా సేద్యం  ,
కరాలు కలిపి  ,
కలాలు కదిపి  
గళాలు  నిండా  పదాలు నింపి  ,
సుశబ్ద   , సుస్వర  , పదాల  నూర్చి  , చేసే
మేధ సాగర మధనం ,
మరులు కొలిపే కావ్య జననం ,
కోయిల  కుహు కుహు లు  ,
పక్షుల  కిలకిలలు,
హిమ బిందువుల తళ తళలు ,
రచనాలంకృత  పదకేళి కి  ప్రకృతి  
పురి విప్పిన మయూరమై నర్తించగా ,
సుస్వర గీతికలై  , 
నీలాల  గగనాల  ఆ  మేఘమాల  ,
కురిపించిన   చిరు  జల్లులు  
హరివిల్లై  గగనాన , 
ఇల చేరుతూ  పుడమిని తాకగ ,
ఎగసిన పరాగ పరిమళాలు  మైమరపించగా , 
చిటపట  చినుకు ల  తొలకరి లో  ,
చిరు  చిరు చిగురులు చిగురించగా  ,
చిరు చిరు నగవుల  సొగసులతో  ,
అరకొర  విరిసిన  నవ్వులతో , 
సుమాలు సుగంధం వెదజల్లగ  ,
చల్లగా వీచే పవనాల  స్పర్స  ,
సుస్వర  గీతికలై  వీనుల తాకగా,  ఉప్పొంగిన  తరంగమై
ఎగిసే  మనసే

Friday, October 9, 2015

వీర సైనికా వందనం

   సౌర్య కీర్తి  ---  జాతి స్ఫూర్తి  

మీ బుల్లెట్ల  వర్షం  తొలకరి  జల్లు లా ప్రారంభమై , 
పెను తుఫాను లా మారి , 
ప్రళయ  మారుతము  గా 
సరిహద్దు  శత్రువులను 
చుట్టు ముట్టి,
తరిమి కొట్టి,
భారతీయులపై  కురిపించాయి  
విజయ మల్లెల  వర్షం
పెల్లుబికింది  మీ పట్ల అంతటా  హర్షం . 
వర్షం వెలిసిన తరువాత  వీచే 
ఈదురు  గాలులలో ఎగురుతోంది  
ఎగురుతోంది మువన్నెల  జెండా
అనంతమైన  ఎత్తులో  
అశేష  హిమాలయా పర్వతాల మీద 
మ్రోగిస్తూ  విజయ దుందుభి
 శిఖరాగ్రము ఫై  తల ఎత్తి సగర్వం గా
మిలమిలా  మెరుస్తూ  ,
అందరు  యోధుల  విజయానికి  సంకేతము లా ,
మరెందరో  యోధుల  త్యాగానికి ఫలితం లా ,
దేశ మంతటా విజయోత్సావాలు  వెల్లి విరుస్తుంటే  ,
తల్లీ భారతి 
ఏమిటమ్మా నీ కళ్ళలో  నీళ్ళకు అర్థం మన వీర సైనికుల సౌర్యము  అనిర్వచనియము. ,
పరాక్రమము  అత్యద్భుతం  ,
త్యాగం  చిర స్మరణియమ్  ,
శత్రువులను తరిమి కొట్టి మన జాతి  గౌరవాన్ని  ,
మన దేశ ప్రతిష్టను కాపాడిన   
ఇలాంటి  వీరులను కన్నందుకు  
కళ్లలొ కలిగిన  ఆనంద భాష్పాలా,
లేక  
వీర పరాక్రమము  తో యుద్ధము లో 
దేశ రక్షణ  కై  ,  
అశువులు బాసిన  
వీర యోధుల త్యాగానికి అశ్రు తర్పణమా  ......

మన దేశ రక్షణ కై పోరాడే ప్రతీ వీరునికి 
వినమ్రము గా  వందనము  చేస్తూ  
 కవితను  అంకితమిస్తున్నా  




Wednesday, October 7, 2015

ఇంకెన్నాళ్ళు




అడుగడుగున మద గమనం  మనుగడ లేని  వనితా లోకం  

చీకట్ల ముసుగులో ' చితి ' కి  పోతున్న  బ్రతుకులు

అభయా  "  లెన్నున్నా  ఆరని మంటలు 

పగలనక రేయనక బ్రతుకు తెరువుకై అతివల అనితర పోరాటం 
నడి సంద్రం లో పడవ ప్రయాణం
కామాంధుల  చెర లో  కలలు కల్లలై , 
నిరాశ్రయాశ్రు  తర్పణం   
ముసురు కున్న చీకట్లలో  
ముగిసిపోతున్న జీవితాలు  
రక్తాశృవులతొ  పుడమి తల్లి నిర్వేదం
పుడమి తల్లి నిర్వేదం.......